మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ డా.స్రిజన క్రుషి, అధికారులతో చేసిన టీమ్ వర్క్ ఫలితంగానే విశాఖకు స్వచ్ఛ సర్వేక్షణ్ లో మంచి ర్యాంకు సాధ్యపడిందని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫే అసోసియేషన్ అధ్యక్షుడు బంగారు అశోక్ కుమార్ అన్నారు. శనివారం విశాఖలో కమిషనర్ ను స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఎంతో మంచి విజన్ వున్న ఐఏఎస్ అధికారిని డి.స్రిజిన అని కొనియాడారు. ఆమె ముందుచూపు, చేసిన అభివ్రద్ధి వలనే జివిఎంసికి మంచి పేరు వస్తుందన్నారు. ఇటీవల బీచ్ రోడ్డులోని నిర్మించిన అందుల పార్కుతో అంతర్జాతీయ ఖ్యాతి కూడా వచ్చిందని కొనియాడారు. విశాఖను స్వచ్చవిశాఖగా చేయడంలోనూ, చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దడంలోనూ కమిషనర్ విశేషంగా క్రుషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ, ప్రభుత్వం తరపున చేసే కార్యక్రమాలు మీడియా సహాయం ఎంతగానో అందిస్తున్నారని, ఇదే ఉత్సాహాన్ని, సహకారాన్ని రానున్న రోజుల్లోనూ అదించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని విభిన్నప్రతిభావంతుల స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో దరఖాస్తు చేసుకొని విద్యార్హతల దృవపత్రాలను సమర్పించని అభ్యర్ధులు డిసెంబర్ 6లోగా www.dw2020backlogsklm.in వెబ్ సైట్ నందు అప్ లోడ్ చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.జీవన్ బాబు కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు. 2019-20 సం.నకు విభిన్న ప్రతిభావంతుల స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ కు సంబంధించి క్లాస్–4, గ్రూప్–4 బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకై 2020 మార్చి 26లోగా పై తెలిపిన వెబ్ సైట్ నందు దరఖాస్తుతో పాటు విద్యార్హతలను నందు అప్లోడ్ చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. కానీ కోవిడ్, లాక్ డౌన్ కారణంగా 646 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమ విద్యార్హతలను అప్ లోడ్ చేయలేదని చెప్పారు. దరఖాస్తు చేసుకొని విద్యార్హతల ధృవపత్రాలను సమర్పించని అభ్యర్ధులు డిసెంబర్ 6వ సాయంత్రం 5.00గం.లలోగా సంబంధిత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు. నిర్ణీత తేదీ ముగిసిన తర్వాత ధృవపత్రాలను అప్ లోడ్ చేయుటకు వీలుపడదని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు. అప్ లోడ్ చేయగోరు అభ్యర్ధులు తమ పరిధిలో గల మండల అభివృద్ధి అధికారి కార్యాలయం లేదా గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సహకారంతో సదరు వెబ్ సైట్ నందు అభ్యర్ధి యొక్క ఆధార్ నెంబర్ లేదా ఇదివరకు దరఖాస్తు చేసుకున్న రిజిస్టర్ నెంబరుతో అప్లికేషన్ తెరచి విద్యార్హతల ధృవపత్రాలను అప్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇదివరకు దరఖాస్తు చేసుకొని విద్యార్హతల ధృవపత్రాలను సమర్పించని అభ్యర్ధులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికెళ్లినా ఓ హోదాతోనే వెళతారు..ఆఖరికి వరదముంపులకు కూడా మందీ మార్భలంతోనే ఎవరినీ ముట్టుకోకుండానే వెళతారు..కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని మంత్రులు దానికి పూర్తిగా భిన్నం. తుపాను తాకిడి దెబ్బతిన్న ప్రాంతాలను చూడటానికి వెళ్లడానికి మంత్రి పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మాత్రం స్వయంగా తానే పడవను తెడ్డువేసుకొని నొడుపుతూ వేళ్లారు. శనివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం వీర్లగుడిపాడు సందు సందులన్నీ కలియతిరుగుతూ పరిస్థితులను సమీక్షించి, ఎంత వరద వచ్చినా ఎటువంటి ప్రాణనష్టం జరగని విధంగా పటిష్ట చర్యలు చేపట్టారు. దాదాపు అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చినా ఇంకో 100 మందికి పైగా గ్రామంలో ఉండడంతో అక్కడికి స్వయంగా పడవ నడుపుతూ వెళ్లి పలకరించారు. పడవ నడిపేవారు తాము నడుపుతామని చెప్పినా.. ఆ తెడ్డు అందుకోండి నేనే పడుపుతానంటూ పడవ ప్రయాణం సాగించారు. ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా గ్రామస్తుల రాకపోకలకు అనువుగా బ్రిడ్జి కట్టించి శాశ్వత పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు... వరద వస్తున్న నేపథ్యంలో ముందు ముందు ప్రజలకు మంచినీరు, భోజన సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీకి పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్ గా నియమితులైన ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి ని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రాయూనివర్శిటీ విసి చాంబర్ లో అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ యూనియన్ సభ్యులు వెళ్లి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఏయూలోనే చదివి, ఏయూలోనే ఆచార్యునిగాపనిచేసి నేడు అదే ఏయూకి ఉప కులపతిగా నియమితులవడం శుభపరిణామం అన్నారు. ఎంతో మంది విసిలు ఇక్కడ పనిచేసినా ఇంతటి గౌరవం ఎవరికీ దక్కలేదన్నారు. ఆసియాకే తలమానికంగా వున్న ఏయూ మీ హయాంలో మరింత అభివ్రుద్ధి సాధింస్తుందని ఆశోక్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కులు, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడని రాష్ట్ర రహదారుల మరియు భవనాల శాఖా మాత్యులు మంత్రి మాలగుండ్ల శంకర నారయణ అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 130 వ వర్థంతి సందర్భంగా పెనుకొండ లోని మంత్రివర్యుల క్యాంప్ కార్యాలయంలో ఆయన మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జోతిబా పూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు పూలే ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త అని మంత్రి కొనియాడారు.ఆయన కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకు గురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడన్నారు. అంతేకాకుండా భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడన్నారు.ఆయన చూపిన బాటలో మనమంతా నడచినప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిభా ఫూలే ఆశయాలను సాధించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పిలుపునిచ్చారు. శనివారం ఫూలే వర్థంతి సందర్భంగా కలెక్టరేట్ వద్ద నున్నవిగ్రహానికి, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, బిసి సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు జ్యోతిభా పూలే అని కొనియాడారు. ఆయన స్మారకార్థం విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఫూలే సర్కిల్ గా నామకరణం చేసి, మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో అభివృద్ది చేయనున్నట్లు ప్రకటించారు. పూలే విగ్రహం ప్రక్కనే సావిత్రిబాయి ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బిసి సంఘాలు ముందుకు వచ్చాయని, దీనికి స్థానిక ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి కూడా సహకారం అందించనున్నారని చెప్పారు. వీలైనంత త్వరలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సర్కిల్ అభివృద్ది పనులను కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రంగుముద్ర రమాదేవి మాట్లాడుతూ జ్యోతిభా పూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, సామాజిక వెనుకబాటుకు గురైన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన చేసిన ఆదర్శవంతమైన సేవలను జాతి ఎన్నటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. ఫూలే ఆశయాల సాధనలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, బిసి కులాల కోసం 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి, వారి అభివృద్దికి కృషి చేస్తున్నారని రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, జిల్లా బిసి సంక్షేమాధికారి ఆర్‌వి నాగరాణి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధం, పశుసంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, డిపిఓ కె.సునీల్‌రాజ్‌కుమార్, డుమా పిడి ఏ.నాగేశ్వర్రావు, మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలాకుమారి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, మెప్మా పిడి కె.సుగుణాకరరావు, డిపిఆర్ఓ డి.రమేష్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, డిపిఎం బి.పద్మావతి, బిసి, ఎస్‌సి సంఘాల నాయకులు ముద్దాడ మధు, రామారావు, ఆదినారాయణ, బసవ సూర్యనారాయణ, వసతిగృహ సంక్షేమాధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
ఆ మంత్రికి చదువు విలువేంటో తెలుసు..విద్యాలయాలకు భవనాలు వస్తే విద్యార్ధుల భవిష్యత్తు ఎలావుంటుందో ఇంకా బాగా తెలుసు..నాడు ఉపాధ్యాయునిగా పనిచేసిన అనుభవం..నేడు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న విధానం నియోజవర్గానికి శాస్వత అభివ్రుద్ధి సాకారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కురుపాం మండలం తేకరఖండిలో జెఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు 105.32 ఎకరాలు భూమి కేటాయించడంతో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అభివ్రుద్ధిలో మరో మైలురాయి దాటినట్టు అయ్యింది. ఆది నుంచి విద్య, వైద్యం, గిరిజనుల అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టి కేంద్రీకరించే మంత్రి తన నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మంజూరు చేయించుకోవాలని చూస్తున్న జెఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజి భవంతుల అవసరాలకు భూమి కేటాయింపులు చేయించుకోగలిగారు. భూమి కేటాంయిపునకి లైన్ క్లియర్ కావడంతో ఇక భవనాలపై ఆమె ద్రుష్టి పెట్టనున్నారు. నాడు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సికిసెల్ ఎనీమియాపై పోరాటం చేసి మరీ న్యూట్రిషన్ ఫుడ్ కేంద్రాలు, మెడికల్ సెంటర్లు మంజూరు చేయించిన డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఇపుడు నియోజకవర్గ అభివ్రుద్ధిలోనూ అదే స్థాయి చొరవ తీసుకుంటూ ముందుకెళ్లడం పట్ల నియోజకవర్గ ప్రజల నుంచే కాకుండా సహచర మంత్రులు, ఎమ్మెల్యే నుంచి కితాబు పొందుతున్నారు. ఏదైనా ఒక దూరద్రుష్టి గల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెనుకబడిన నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తే అభివ్రుద్ధి ఈ స్థాయిలోనే చేస్తారనడానికి డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీనివాణి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.
'మహత్మా జ్యోతిరావు ఫూలే' గురించి తెలుసుకోవడమంటే ఆధునిక భారతదేశ సామాజిక వ్యవస్థను తెలుసుకోవడమే. భారత దేశంలో 'మహాత్మ' అనే బిరుదాంకితులు ఇద్దరు. ఒకరు జ్యోతిరావు ఫూలే. మరొకరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. వర్ణ, కుల వ్యవస్థకు ప్రాణం పోసిన ''మనుస్మతి''కి, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు ఫూలే అవిశ్రాంతంగా పోరాటం చేసిండు. మమతానురాగాల మానవీయ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కషి చేసిండు. సైద్ధాంతిక, విద్యా రంగాల్లో ఉద్యమాలను నిర్మించడం, వాటికోసం సంస్థలను నెలకొల్పడం వంటివి చేశాడు. జ్యోతిరావు ఫూలే చేసిన కషిని, ప్రభావాన్ని చాటిచెప్పేందుకు 1888 మే 11న పూణేలో పెద్ద బహిరంగసభ జరిగింది. వేలాది మంది ప్రజల సమక్షంలో జ్యోతిరావు ఫూలే ''మహాత్మ'' అనే బిరుదుతో సత్కారం పొందినారు.
పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు. నడుస్తున్న కాలానికి వ్యాఖ్యానం అక్కర లేదు. కానీ వక్రీకరించబడ్డ చరిత్రకు పునర్ నిర్వచనం అవసరం. భారతదేశంలో ఆధిపత్య కులాలు విషసంస్కతి వాస్తవాలను సమాధి చేసింది. అందుకే ''ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథలన్నీ కావాలిప్పుడు''. 1980వ దశకం వరకు 'మహాత్మ' అనగానే చాలామందికి తెలిసింది ''మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ'' మాత్రమే. 'మహాత్మ జ్యోతిరావు ఫూలే'ను తన గురువు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించిన విషయాన్నీ వెలుగులోకి రానీయలేదు. ఉద్దేశపూర్వకంగానే బడుగు జన మేధావుల గొప్పతనాన్నీ, నాయకుల విశిష్టతనూ, పోరాటయోధుల చరిత్రనూ కనుమరుగు చేసినారు. కట్టుకథలు చెప్పినారు. జ్యోతిరావు 1827 ఏప్రిల్ 11న పూణేలో జన్మించినారు. తల్లి చిమ్నాబాయి, తండ్రి గోవిందరావు. తొమ్మిది నెలల పసిప్రాయంలోనే జ్యోతిరావు తల్లి మరణించింది. గోవిందరావు రెండో పెండ్లి ఆలోచనే చేయలేదు. తల్లి, తండ్రి తానై ఆ పసివాడిని పెంచసాగిండు. కానీ బాలుడిని సాకుడు గోవిందరావుకు కష్టమైంది. అందుకే తన సమీప బంధువైన సగుణాబాయి సాయం కోరిండు. ఆమె బాల్య వితంతువు. చాలా తెలివైంది. కరుణామయురాలు. జ్యోతిరావును కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ బాలుడి చురుకుదనం, తెలివితేటలు సగుణాబాయి గుర్తించింది. బాలుడు వ్యవసాయంలో తనకు తోడుగా ఉండాలని గోవిందరావు అనుకున్నాడు. పట్టుబట్టి జ్యోతిరావును మంచి స్కూళ్లో చేర్పించింది సగుణాబాయి. విద్యాబుద్దులతోపాటు మానవ విలువలు నేర్పింది. మనిషిగా దిద్దితీర్చింది.
ఆనాడు శూద్రులకు, అతిశూద్రులకు ఆదిపత్య సమాజంలో విద్యార్హత లేదు. కానీ ఇంగ్లీష్ పాలకుల ప్రాబల్యంతో శూద్రులకు, అతిశూద్రులకు చదువుకునే అవకాశాలు కలిగినై. గట్ల శూద్రుడైన ఫూలే కూడా ప్రాథమిక విద్యనభ్యసించిండు. చదువు మానేసి తండ్రి గోవిందరావుకు వ్యవసాయంలో సాయం చేస్తున్నడు. అయినా ఫూలేకు చదువు మీద శ్రద్ధాసక్తులు తగ్గలేదు. రాత్రి నిద్రపోయే ముందు లాంతరు వెలుగులో చదువుకునే వాడు. జ్యోతిరావుకు చదువుపట్ల ఉన్న ఆసక్తిని ఒక ముస్లిం టీచర్, ఇంటి పక్కనున్న ఒక క్రైస్తవ పెద్దమనిషి గమనించి గోవిందరావును ఒప్పించి జ్యోతిరావు విద్యాభ్యాసం కొనసాగేలా చేసిండ్లు. పూణేలో స్కాటిష్ మిషన్ నడుపుతున్న స్కూళ్ల 1841లో జ్యోతిరావు చేర్పించారు. గోవిందరావు తన కొడుకు జ్యోతిరావుకు పెండ్లి చేయాలి అనుకున్నడు. సావిత్రిబాయిని చూసి సరైన జోడి అని సగుణాబాయి భావించింది. 1840లో పెండ్లి అయ్యింది. అప్పుడు జ్యోతిరావుకు పన్నెండు ఏండ్లు. సావిత్రిబాయికి తొమ్మిది ఏండ్లు. ఆ బాలదంపతులిద్దరికీ తల్లి ప్రేమను పంచి సామాజిక విప్లవకారులుగా తీర్చిదిద్దిన మహాసాధ్వి సుగుణాబాయి.
ఫూలేకు బాల్యం నుంచే పుస్తక పఠనంపై అమితాసక్తి. ఆంగ్లంలో జాన్ స్టుఅర్ట్ మిల్ రాసిన ''ఆన్ లిబర్టీ'' థామస్ పైన్ రాసిన ''ద రైట్స్ ఆఫ్ మాన్''(మానవ హక్కులు), ''ది ఏజ్ ఆఫ్ రీజనింగ్'' అనే పుస్తకాలు జ్యోతిరావు ఫూలేను చాలా ప్రభావితం చేసినై. ఆ రచనలు ఫూలే మనసులో ఉన్న తిరుగుబాటు తత్వాన్ని తట్టి లేపినై. ఈ పుస్తకాలు ఇచ్చిన స్ఫూర్తితో, శక్తితో, అవగాహనతో ఫూలే భారత సమాజాన్ని నిశితంగా పరిశీలించి విశ్లేషించారు. భారతదేశంలో చలామణి అవుతున్న ఆదిపత్యం, మనుస్మతి, కులవివక్ష జ్యోతిరావుకు చాలా అమానవీయంగా తోచినై. దాంతో భారత సమాజాన్ని సంస్కరించాలన్న ఆలోచన మొదలైంది. శివాజీ జీవిత చరిత్ర, అమెరికా స్వాతంత్య్ర పోరాటం, స్వేచ్ఛ, సమానత్వం వైపు ఆయన ఆలోచనలను మళ్లించినై. 1848లో ఒక బ్రాహ్మణ మిత్రుడు సదాశివ భిల్లాల్ గోవింద్ పెండ్లి ఊరేగింపులో జరిగిన అవమానం ఫూలే జీవితాన్ని మలుపు తిప్పింది. 'మాలి' కులస్థుడైన జ్యోతిరావును ఆదిపత్యం చెలాయించేవారు దుర్భాషలాడారు. అమానుషంగా కించపరిచినారు. కిందపడేసి కాళ్లతో తన్నిండ్లు. ఆ అవమానాన్ని జ్యోతిరావు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా ఆలోచించింనారు. కానీ అది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదనీ, మొత్తం తన జాతికి జరిగిన అవమానమనీ భావించిండు. తన ఆత్మహత్యతో ఆ అవమానం ఆగిపోదని, తాను బతికుండి జాతికి అవమానాలు జరగకుండా ప్రతిఘటించాలని నిర్ధారించుకున్నడు. దాంతో ఈ సమాజాన్ని సంస్కరించడానికి శ్రీకారం చుట్టిండు. గోవిందరావు మొదట కూరగాయల వ్యాపారి. అనంతరం పీష్వాల కాలంలో ఆయన పూల వ్యాపారం చేయడంతో వాళ్ల ఇంటిపేరు ఫూలేగా మారింది. పూర్వం వాళ్లది మహారాష్ట్రలోని సతార జిల్లా కాడ్గాన్. ఫూలే ముత్తాత గ్రామ ఉద్యోగిగా పనిచేసిండు. ఆ ఊరి కులకర్ణి అంటే కరణం దురహంకారాన్ని భరించలేకపోయిండు. ఆ దుర్మార్గాన్ని సహించలేదు. ప్రతిఘటించే శక్తీ ఆయనకు లేదు. కానీ ఆ కులకర్ణి కుల దురహంకారాన్ని ఆ ఊరిని వదిలేసిండు. పూణేకు మకాం మార్చిండు. గట్ల అన్యాయాన్నీ, ఆధిపత్యాన్నీ ఎదిరించే గుణం వారసత్వంగా జ్యోతిరావుకు సంక్రమించింది.
ఆదిపత్య సమాజం 'సరస్వతీదేవిని చదువుల దేవత'గా కొలుస్తున్న దేశంలో మహిళా టీచర్లు లేకపోవుడు విడ్డూరంగా ఉంది కదూ! పెద్దల ఆదిపత్యాన్ని తిరస్కరించాలని సామాన్య జనాన్ని ప్రోత్సహించిండు. సమాజంలో సగభాగామైన మహిళలు అభివద్ధి చెందకుండా సమాజం పురోగతి చెందదని ఫూలే నమ్మిండు. అందుకే స్త్రీలు విద్యావంతులు కావాలని భావించిండు. ఇతరులకు ఆదర్శంగా ముందు తన భార్య సావిత్రిని చదివించిండు. సావిత్రిబాయిని 1846 -1847లో అహ్మదాబాద్‌లో టీచర్ ట్రైనింగ్‌కు పంపించిండు. ఆమెతోపాటు ఫాతిమా షేక్ అనే ముస్లిం మహిళ కూడా శిక్షణ పొందింది. ఫూలే దంపతులు 1848లో తొమ్మిది మందితో దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారభించిండ్లు. సావిత్రికి తోడుగాఉన్న మరో మహిళా టీచర్ సగుణాబాయి. ఆమె అండదండలతోనే ఫూలేదంపతులు అనేక సంస్కరణలు చేపట్టిండ్లు. సామాజిక విప్లవానికి బాటలు వేసిండ్లు.
ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. బాలికలను ముసలివారికి ఇచ్చి పెండ్లి చేయడంతో చాలామంది అమ్మాయిలు వితంతువులుగా జీవితం గడపాల్సి వచ్చేది. కుటుంబంలోని మగవాళ్లు బలత్కరించడంతో అక్రమంగా గర్భావతులు అయ్యేవాళ్లు. ఆ అవమానాన్ని భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్లు. కొందరైతే ఆ అక్రమ సంతానాన్ని హత్యచేసేవాళ్లు. ఇది ఫూలే దంపతులను బాగా కలిచివేసింది. అభాగ్యులు చనిపోవద్దని, అక్రమంగా జన్మించిన శిశువులను చంపోద్దని ఫూలే దంపతులు పిలుపునిచ్చిండ్లు. తమ ఇంట్లో స్వేచ్ఛగా పురుడు పోసుకోవచ్చని, ఆ పిల్లలు వద్దనుకుంటే తమ వద్దే వదిలి వెళొచ్చని ప్రకటించిండ్లు. అట్ల 1872లో ఒక బ్రాహ్మణ యువతికి పుట్టిన బిడ్డనే ఫూలే దంపతులు దత్తపుత్రునిగా స్వీకరించిండ్లు. ఆ బాలునికి యశ్వంతు అని పేరు పెట్టుకున్నరు. యశ్వంతు వైద్యవిద్యను అభ్యసించిండు. వైద్య వత్తిలో స్థిరపడ్డడు.
బ్రాహ్మణాధిపత్య చెర నుంచి శూద్రులను కాపాడుడే లక్ష్యంగా మహత్మా జ్యోతిరావు ఫూలే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని స్థాపించిండు. భగవంతుడికి భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండొద్దని సత్యశోధక సమాజం పిలుపునిచ్చింది. పురోహితుల అవసరం లేకుండా సభ్యులు దేవు డిని పూజించేవాళ్లు. సత్యశోధక సమాజం అభాగ్యులైన వితంతు వులకు, అనాధ శిశువులకు ఆశ్రయమైంది. కుల, మత, లింగ, ప్రాంత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ సత్యశోధక సమాజంలో సభ్యత్వం కల్పించిండ్లు. వేదాలు పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకించిండు. విగ్రహారాధననూ ఖండించిండు. పూణే పట్టణ పరిపాలనలో భాగమైండు. మునిసిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా కూడా సేవలందించిండు. స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యమత్యం, మానవత్వంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించిండు. శూద్రులను, అతిశూద్రులను భావదాస్యం నుంచి విముక్తుల్ని చేయాలని భావించిండు. ప్రగతిశీల భావజాల వ్యాప్తికోసం ఫూలే సాహిత్యాన్ని, పత్రికారంగాన్ని ఎంచుకున్నడు. ''గులాంగిరి'', ''త్రుతీయరత్న'', ''పౌరోహిత్యం బండారం'', సార్వజనిక సత్యధర్మం'', ''సేద్యగాడి చెర్నాకోల'', ''హెచ్చరిక'' తదితర ఎన్నో గ్రంథాలు రాసి, ప్రచురించిండు. అంతేకాదు ''దీనబంధు'' అనే వారపత్రికను ప్రారంభించిండు. కార్మికుల, కర్షకుల సమస్యలు, బీదల బాధలు, ఇతర సామాజిక సమస్యలెన్నో ఈ పత్రికలో అచ్చయ్యేవి. సామాజిక ప్రజాస్వామ్యం సాధించుడే భారతదేశానికి ముఖ్యమని మహత్తర సందేశం ఇచ్చిన మహాత్మ జ్యోతిరావు ఫూలే తన గురువు అని భారత రాజ్యంగా నిర్మాత డా.బిఆర్. అంబేద్కర్ ప్రకటించిండు. సమసమాజ స్థాపన కోసం నిరంతరం తపిస్తూ అనారోగ్యంతో ఫూలే 1890 నవంబర్ 28న మరణించిండు. కుల వివక్షను ఎదిరించి బహుజనుల బతుకుల్లో వెలుగు రేఖలు ప్రసరింపజేసిన క్రాంతిజ్యోతి. వెట్టి బతుకుల్లో తొలిపొద్దు మహాత్మ జ్యోతిరావు ఫూలేకు జోహార్లు. భారదేశ సామాజిక విప్లవోద్యమంలో, సంఘ సంస్కరణోద్యమంలో మగనితో సమానంగా పోరాడిన సాహస వనిత సావిత్రిబాయికి జోహార్..రాష్ట్రపిత జ్యోతిరావు ఫూలే వర్దంతి సంధర్భంగా నివాళులు,..
ఏడాది దాటినా వీరి పనితీరులో మార్పు రావడం లేదు..ఏం చేస్తారులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు..విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారందరికీ చార్జి మెమోలు ఇవ్వండి అంటూ జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన వార్డు సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్రవారం అనంతరం, 70 వ వార్డులోని ఎస్.ఎల్.ఎన్. నగర్లో ఉన్న నాలుగు సచివాలయాలను సందర్శించి వార్డు కార్యకర్తల పనితీరును రికార్డులను, వారి రిజిస్టరులను తనిఖీ చేసారు. వార్డు కార్యదర్శులు సరిగా పనిచేయడం లేదని, రికార్డులు సరిగా రాయడం లేదని, కార్యదర్శులపై మరియు వార్డు ప్రత్యేక అధికారి, రెవెన్యూ ఆఫీసరు సురేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పధకాలకు సంబందించిన పోస్టర్లు, సూచికలు సరిగా లేనందున వార్డు ప్రత్యేక అధికారులతో పాటు, వార్డు కార్యదర్సులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చార్జ్ మెమోలు ఇవ్వాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఇక ముందు, ఇటువంటివి పునరావృతం అయితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకు ముందు గోపాలపట్నం ఆర్చ్ వరకు రోడ్లను పరిశీలించి 2కోట్ల 60లక్షలు రూపాయల అంచనా వ్యయంతో బి.టి. రెన్యూవల్ పనులకు ఆమోదం తెలిపారు. సుజాత నగర్ 80 అడుగుల రహదారి మరియు కిషోర్ లే అవుట్ రహదారి వెడల్పు పనులకు సంబందించి ఆర్.డి.పి.ని తయారు చేయాలని అసిస్టెంట్ టౌన్ ప్లాన్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జోనల్ కమిషనర్ రమణ, పర్యవేక్షక ఇంజినీరు శివ ప్రసాదరాజు, ఏ.సి.పి. భాస్కర బాబు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు వీరయ్య, వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2021పోటీలో మెరుగైన ర్యాంకు సాధనకు అన్ని ఏర్పాట్లుతో సిద్ధం కావాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం, ఆమె ఛాంబరులో జివిఎంసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2021 సంవత్సరంనకు జరుగనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలకు అధికారులు, సిబ్బంది సంయుక్తంగా ఒక ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేపట్టాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ లో సర్వే బృందం ఏ ఏ అంశాలపై తనిఖీ చేస్తారో అందుకు కావలసిన విధంగా డాక్యుమెంటు తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో 6,000 మార్కులు ఉంటాయని అందుకు అనుగుణంగా ప్రతీ విభాగపు ప్రధాన అధికార్లు తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన ఇంజినీరు వారికి ఆదేశాలిస్తూ, ప్రజా / సామాజిక మరుగుదొడ్లు రిపేర్ల కొరకు తగు చర్యలు చేపట్టాలన్నారు. మేజర్ కాలువల్లో పూడికలు తీసే చర్యలు చేపట్టి, ప్లాస్టిక్ సామగ్రి మొదలగునవి పార కుండా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కాలువలపై చెత్త వేయరాదనే బోర్డులు పెట్టాలన్నారు. శానిటరీ ఇన్ స్పెక్టర్ ద్వారా కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. రోడ్లపై గోతులు, కాలి బాటలు యు.జి.డి. లైన్లు యొక్క పునర్నిర్మాణ పనులు త్వరితగతిని చేపట్టాలని ఆదేశించారు. ఈ పనులన్నియూ డిశంబరు 15వ తేది లోగా పూర్తిచేయాలన్నారు.
వాటర్ ప్లస్ సంబందించిన అన్ని పనులు డిశంబరు 15వ తేది లోగా పూర్తీ చేయాలని, నీటి సరఫరా విభాగపు పర్యవేక్షక ఇంజినీరు వారిని ఆదేశించారు. గృహముల నుండి యు.జి.డి. పైపు లైనులకు అనుసంధానం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శుద్ధి చేసిన మురుగు నీరును స్వంత అవసరాలకు వినియోగించేటట్లు ఉద్యాన శాఖ అధికారులతో కలసి ప్రణాళిక చేపట్టాలన్నారు. ఆర్. & డి. వ్యర్ధాలను ప్రణాలికా బద్దంగా నిర్వహించే విధానాల డాక్యుమెంట్లను సిద్దం చేయాలన్నారు. స్వచ్చ సర్వేక్షణ్ లో భాగంగా ఆయా శాఖల భాగస్వామ్యాన్ని అందించాలని ఉద్యానశాఖ, యు.సి.డి. ప్రాజెక్టు డైరెక్టరు, విద్యా విభాగపు డిప్యూటీ విద్యా శాఖాదికారిని ఆదేశించారు. ప్రతీ రోజూ వివిధ విభాగాల ప్రధాన అధికారులు తన విధుల నిర్వర్తించే క్రమాలలో 25 శాతం కాలాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ పనులపై కేటాయించాలన్నారు. వివిధ శాఖల మధ్య చేయవలసిన అగ్రిమెంట్లు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అదనపు కమిషనర్ దా. వి. సన్యాసి రావు, స్వచ్ఛ సర్వేక్షణ్ లో వివిధ కేటగిరీల కింద కేటాయించిన మార్కులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఉన్నతాధికారులకు వివిరించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, సి.సి.పి. విద్యుల్లత, చీఫ్ మెడికల్ అఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, పి.డి. (యు.సి.డి) వై. శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ ఏ.డి. ఎం. దామోదర రావు, పర్యవేక్షక ఇంజినీర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని ఎం.వి.పి. కోలనీ సెక్టార్-1లో హరితవనం పార్కును రూ.60.00 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్టు జివిఎంసి కమీషనర్ డా.జి.స్రిజన చెప్పారు. శుక్రవారం ఈ మేరకు జోన్2 పరిధిలోని అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ సభ్యులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సంబందిత పార్కు అభివృద్ధి స్థలంలో పెండింగ్ లో ఉన్న కోర్టు వాజ్యాన్ని త్వరితగతిన పరిష్కారం అయ్యేటట్లు తగు చర్యలు చేపట్టాలని జోన్-2 పట్టన ప్రణాళిక విభాగపు అధికారులను ఆదేశించారు. తదనంతరం ఎం.వి.పి. కోలనీ 7వ వార్డులో గల హెడెన్ స్పౌట్స్ దివ్యాంగుల పాఠశాల భవన స్థలం అభివృద్ధి పరచడానికి సంస్థ పెట్టిన ప్రతిపాదనలను పరిశీలించారు. ఈపనులన్నీ సత్వరమే పూర్తిచేయడం ద్వారా పార్కు పనులను ఈ ప్రాంతంలో ప్రారంభించడానికి అవకాశం వుంటుందన్నారు. ఈ క్షేత్రపర్యటనలో అసిస్టెంట్ డైరెక్టర్(హార్టికల్చర్) ఎం. దామోదరరావు, పర్యవేక్షక ఇంజినీరు రాజారావు, కార్యనిర్వాహక ఇంజినీరు మెహెర్ బాబా, జోన్-2 పట్టణ ప్రణాళిక అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరులో అధిక వర్షాలు, వరదల కారణంగా ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి పోలీసుల సహాయం తీసుకోవాలని నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషన్ కోరారు. శుక్రవారం రాత్రి నగరంలోని పాత చెక్ పోస్టు వద్ద గల అహ్మద్ నగర్ కాలనీ వాసులతో స్వయంగా మాట్లాడి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాలతో పాటు, సోమశిల జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారన్నారు. దాని కారణంగా 10 అడుగులు పైకి నీరు వచ్చే అవకాశం వుందని..లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రాంతాలైన భగత్ సింగ్ కాలనీ, దర్గా వీధి, లక్ష్మీ స్ట్రీట్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. ప్రజలు అత్యవసర సమయాల్లో 100, 9390777727 కి కాల్ చేయాలని సూచించారు.
గిరిజనుల దశాబ్దాల కల సాకారం కానుందని సాలూరు ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ పిడిక రాజన్న దొర అన్నారు. శుక్రవారం సాలూరు-దళాయి వలస రోడ్డు నుంచి శంబర గ్రామం పోవు రహదారిలో కందులపదం గ్రామ సుమారుగా 5 .12 కోట్ల రూపాయల తో గోముఖీ నది పై కి.మీ.4/2-4 వద్ద నూతన వంతెన నిర్మాణ చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేసి,కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజన్నదొర మాట్లాడుతూ, రాష్ట్రం లో వివిధ జిల్లాల నుండి వచ్చి స్థిరపడిన రైతుల కారణంగా ఈ ప్రాంతం, ఇక్కడి రైతులు అభివృధి చెందారాన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నారు. మారుమూల గ్రామాలకు సరైన రోడ్లు వేయని కారణంగా గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి ఇబ్బందులను చూసిన మన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామానికి రోడ్డు వేసి గ్రామాల అభివృద్ధికి బయలు వేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు అన్నారు. సుమారు ఆరు పంచాయతీ పరిధిలో ఉన్న కందుల పదం,కిట్టు పరువు, బుర్జ, మావుడి, పగులు చెన్నూరు, పట్టు చెన్నూరు తదితర పంచాయతీ పరిధిలోని సుమారు 70 గిరిజన గ్రామాల ప్రజలకు ఈ వంతెన ఏంతో ఉపయోగపడుతుందన్నారు. ఇటువంటి బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వం శంకు స్థాపనలకే పరిమితమైందన అన్నారు. ప్రజలకు చాలా అవసరమైన వంతెన అని ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిపి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్.అండ్.బి ఇంజనీరింగ్ ఆధికారులు, మండల ఆధికారులు, పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని కె.జి.బి.విలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలనను తప్పనిసరిగా పాటించాలని, సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని సమగ్ర శిక్ష పథక సంచాలకులు పైడి వెంకటరమణ హెచ్చరించారు. రణస్థలం మండలంలోని కె.జి.బి.విని శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కె.జి.బి.విలో జరిగిన నాడు - నేడు పనులను పరిశీలించిన ఆయన కె.జి.బి.విలో పనిచేస్తున్న సి.ఆర్.టిలు, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. సమయపాలన పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కె.జి.బి.విలో పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరువేయాలని ఆదేశించారు. కోవిడ్ నేపధ్యంలో విద్యార్ధులకు కోవిడ్ సోకకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ మాస్కును ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ , సి.ఆర్.టిలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలంటే తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాలలో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో సుమారు 10 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశ ముందని, దీనిలో 8 లక్షల టన్నులను జిల్లాలోని 246 పి.పి.సిల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. జిల్లావ్యాప్తంగా 811 రైతు భరోసా కేంద్రాలను 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు మద్దతు ధరగా సాదారణ రకానికి 100 కేజీలకు రూ.1868/-సు, 80 కేజీలకు రూ.1494.40పై, గ్రేడ్ ఎ-రకానికి 100 కేజీలకు రూ.1888/-లు, 80 కేజీలకు రూ.1510.40 పై నిర్ణయించినట్లు చెప్పారు. పౌర సరఫరాల సంస్థ వెలుగు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్, కన్స్యూమర్ కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్, గవర్నమెంట్ ఎంప్లాయిమెంట్ కో-ఆపరేటివ్ సొసైటీస్, మొలక రైతు సంఘాలు, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీస్ మరియు రైతు ప్రోడ్యుసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికే కొనుగోలు సిబ్బంది, కేంద్రానికి అవసరమగు తేమ కనుగొను పరికరము, ట్యాబ్, కంప్యూటర్, ప్రింటర్, ఎనాలిసిస్ కిట్, ఫోకర్, పొట్టు తీసే పరికరాలను ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సిద్దం చేయడం జరిగిందని తెలిపారు. ఈసారి ప్రభుత్వం క్రొత్త విధానానికి శ్రీకారం చుట్టిందని, దాని ప్రకారం రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలంటే తమకు అందుబాటులో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో వివరాలు నమోదు చేసుకోవలసి ఉందని చెప్పారు. రైతుల వివరాలు ఆర్.బి.కెల్లో నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్(జాతీయ బ్యాంకు ఖాతా),పట్టాదారు పాస్ బుక్ (స్వంతభూమి)లేదా సి.సి.ఆర్.సి మరియు ఎల్.ఇ.సి కార్డు, లీజు భూమి పత్రాలతో పాటు మొబైల్ ఫోన్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలని వివరించారు. జిల్లాలోని రైతులు తమ వివరాలను రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకుని, ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.