వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెస్ క్లబ్. ఈప్రెస్ క్లబ్ లో అధ్యక్ష, కార్యదర్శిల దగ్గర నుంచి సభ్యుల వరకూ అందరికీ ప్రత్యేక గౌరవం, గుర్తింపు వుంటుంది. ఇందులో చాలా మంది వర్కింగ్ జర్నలిస్టులు కాకపోయినా కమిటీలో ఉన్నారు గనుక అలా చెల్లిపోతూ కాలంగడిపేస్తున్నారు. అలాంటి ప్రెస్ క్లబ్ కు 2023 ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహించాలని ఆపధర్మ కార్యవర్గం నిర్ణయించింది. ఈమేరకు విశాఖజిల్లా కలెక్టర్ కు ఈ విషయాన్ని కూడా తెలియజేసింది. ఎప్పుడైతే విజెఎఫ్ కి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారో అప్పటినుంచి ఆశావాహులు, ఇప్పటికే రింగ్ అయిపోయిన సభ్యులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అంతేకాదు విజయం కోసం పక్కాగా మాస్టర్ ప్లాన్ వేసుకొని మరీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్టు ఏంటంటే.. ప్రత్యర్ధులు విజెఎఫ్ సభ్యులకు అర్ధమయ్యే విధంగా అసలు విషయం చెప్పే ప్రయత్నంలో సఫలీకృతులు అవుతున్నట్టుగా కడపటి వార్తలు అందుతున్నాయి. ఇప్పటికే కోర్టు కేసుల్లో చిక్కుకొని అప్పనంగా పదేళ్లు ఎలాంటి ఎన్నికలూ లేకుండా పరిపాలించేసిన కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన తరువాత అసలు రాజకీయం మొత్తం రసవత్తరంగా సాగడం ప్రారంభించింది..
అసలు సభ్యుల సంఖ్యపై రగడ జరిగే అవకాశం..?
విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఓటుహక్కు ఉన్న సభ్యులు సుమారు 800 మంది వరకూ ఉన్నారు. ప్రో మెంబర్లుగా వున్నారో మరో 800 వరకూ ఉన్నారు. ఆతరువాత సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు మరో 500 మంది వరకూ ఉన్నారు. అయితే కోర్టు నిబంధనల ప్రకారం ఎవరికీ కొత్త సభ్యత్వాలు ప్రెస్ క్లబ్ జారీ చేయలేదు. కానీ ప్రెస్ క్లబ్ బయిలా ప్రకారం మరణించిన, జర్నలిస్టులుగా పనిచేయడం మానేసిన వారి ఓట్లను ఎన్నికలకు వెళ్లే నాటికి కార్యవర్గం సిద్దం చేయాల్సి వుంది. గత కార్యవర్గాలు నడిచిన క్రమంలో ఇబ్బడి ముబ్బడిగా రెండు మూడు పత్రికల విలేఖరులకు విజెఎఫ్ మెంబర్ షిప్ లు ఇచ్చేశారు. అందులో చాలా మంది బదిలీలు అయిపోగా.. మరికొందరు మ్రుతిచెందగా,, ఇంకొందరు వృత్తిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. వాస్తవానికి ఇలాంటి ఓటర్లను ప్రెస్ క్లబ్ ఎన్నికలకు వెళ్లేనాటికి తొలగించి, ఆ జాబితా కోర్టుకి తెలియజేసిన తరువాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని లేదంటే ఆ విషయాన్ని బహిర్గతం చేస్తామని ప్రత్యర్ధి వర్గాలు మాస్టర్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుత కార్యవర్గం(ఆపధర్మ) ఈ పనిచేయకుండా ఎన్నకలకు వెళితే వాళ్లు దాచిపెట్టిన అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగబద్దంగా పోరాడతామని కూడా హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఆ విషయాన్ని ప్రస్తుత సభ్యులకు, ఓట హక్కు కలిగి వున్నవారికీ చెప్పి చైతన్యం తీసుకు వస్తున్నారు.
విజయనగరం ప్రెస్ క్లబ్ పరిస్థితే వస్తుందా.. తేవడానికే ప్రయత్నమా ?
విజయనగరం జిల్లాలోని ప్రెస్ క్లబ్ కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంలో అక్కడి జిల్లా కలెక్టర్ ఆ ప్రెస్ క్లబ్ ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రెస్ క్లబ్ కలెక్టర్ అద్యక్షతన నిర్వహిస్తున్నారు. ఇపుడు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లోని అంశాలను, ప్రస్తుత కార్యవర్గం నిర్భయంగా ఓటర్లకు, ఇతర సభ్యులకు తెలియజేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే సరేసరి అని లేదంటే జిల్లా కలెక్టర్ కు, ప్రెస్ అకాడమీకి, విజెఎఫ్ దాచిపెట్టిన అంశాలను వివరించి ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ పరం చేయిస్తామనే సంకేతాలు కూడా పంపిస్తున్నారు. వాస్తవానికి కోర్టు నిబంధనల ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుని హోదాలోనే ప్రెస్ క్లబ్ కార్యక్రమాలు నిర్వహణ జరగాలి(కోర్టులో కేసులు ఉన్నందున) . కానీ ప్రెస్ క్లబ్ మొత్తం కార్యక్రమాలు చేపడుతుందని ఇప్పటికే కొందరు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిసింది. నిజంగా అదే జరిగితే ప్రెస్ క్లబ్ బయిలా..కోర్టు ఆదేశాలు..ప్రెస్ క్లబ్ లోని ఓటర్లు, మృతి చెందిన వారు, విధి నిర్వహణ నుంచి తప్పుకున్నవారి జాబితాలు ఇస్తే.. పరిశీలించి నిబంధనలు అతిక్రమించారని తెలిస్తే చర్యలు చేపడతామని కలెక్టర్ కూడా సదరు ఫిర్యాదు దారులకు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
విజెఎఫ్ ఎన్నికల్లో కేస్ట్ కోటరీ పనిలో వారంతా బిజీ బిజీ..!
విశాఖలోని విజెఎఫ్ కి ఎన్నికలు నిర్వహిస్తే తమ తమ కార్యవర్గాలను గెలిపించుకోవాలని ఎవరి కోటరీల్లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు ఈ సారి సామాజిక రంగు పులిమి మరీ కార్యక్రమాలు చేపట్టి తమ బలా బలాలను ప్రదర్శించే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో వైపు ఈసారి కొత్తవారితో కార్యవర్గం ఏర్పాటు చేయాలనే కొందరు సీనియర్లు భావిస్తున్నారని తెలిసింది. దానికి అనుగుణంగా రెండు కార్యవర్గాలను కూడా సిద్దం చేసినట్టు సమాచారం. ఎవరు ఏ విధంగా కోటరీలు చేసుకున్నా..పాత కార్యవర్గంలోని వారే మళ్లీ పోటీచేయాలని ఇప్పటికే బలంగా నిర్ణయించుకున్న తరుణంలో విజెఎఫ్ ఎన్నికల వేడిని మరింతగా పెంచుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు కూడా లేని హడావిడి రాజకీయం మొత్తం ఈ విజెఎఫ్ ఎన్నికల్లోనే ఉందా అన్నట్టుగా జరుగుతున్న కార్యక్రమాలు, చేస్తున్న ప్రచారాలు, గూడు పుఠానీలు, మాస్టర్ ప్లాన్ ను ప్రెస్ సభ్యులను, కొత్తగా ఆరాటపడేవారిని అందరినీ ఆలోచింప చేస్తున్నాయి.
వాస్తవాలను తెలియజేసేందుకే ఈఎన్ఎస్ ప్రయత్నం..అదరం..బెదరం..
ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net వాస్తవాలను తెలియజేసే క్రమంలో తమ దృష్టికి వచ్చిన వాషయాన్ని మాత్రమే జర్నలిస్టులు, పాఠకుల ముందు ఉంచుతున్నది. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. ఏ ఒక్కరికీ కొమ్ముకాయమని కూడా ఖచ్చితంగా ప్రకటిస్తున్నాం. అసలు విజెఎఫ్ ఎన్నికలు ప్రకటించిన తరువాత తెరవెనుక ఏం జరుగుతున్నది..ఏం జరగబోతున్నది..వాస్తవాలేంటి..అవాస్థవాలేంటి.. ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు..మళ్లీ విజెఎఫ్ లో తమ సీట్లను భర్తీచేసుకునేందుకు జర్నలిస్టులు కానీ వారు ఎంత ఆరాట పడుతున్నారు..ఇప్పటి వరకూ ఏ నెపంతో పదవులు అప్పనంగా అలంకరించారు తదితర విషయాలను మాత్రమే నిర్భయంగా తెలియజేశాం. ఇకపై కూడా తెలియజేస్తాం..ఈ విషయంలో ఈఎన్ఎస్ ని ఎవరో ప్రభావితం చేస్తున్నారని అనుకున్నవారికి ఈ వార్త ఒక ఉదాహరణగా నిలుస్తుందని మాత్రమం చెప్పగలం. విజెఎఫ్ ఎన్నికల్లో కోర్టు ఏం చెప్పింది..కార్యవర్గం ఏం చేస్తున్నది..ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నది.. ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేసింది అనే అన్నివిషయాలు తెలియజేసినట్టుగానే..రానున్నరోజుల్లో కూడా వాస్తవాలు ఎవరికీ భయపడకుండా నిర్భయంగా బయటపెడతామని చెబుతున్నాం. అంతేకాకు ఎవరు ఏమనుకున్నా..పట్టించుకునేది లేదని కూడా చెబుతున్నాం. భారత దేశపు తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఈఎన్ఎస్.. ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు.. ఎవరికీ అదరదు..మరెవరికీ బెదరదు..!