రాష్ట్రంలోని ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదని యువ నాయకుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ధర్మాన రామ్మోహన్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వ్యాధులకు పేద, ధనిక వర్గాలు ఉండబోవని అందరూ సమానమేనని, అయితే కార్పొరేట్ ఆసుపత్రులలో లక్షల ఖర్చుతో కూడిన వైద్యాన్నిపొందేందుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి దివంగత వై.యస్.ఆర్ అయితే మరో పది అడుగులు ముందుకు వేసి మరిన్ని సేవలతో డా. వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పేరుతో అన్నిరకాల వైద్య సదుపాయాలను కార్పొరేట్ ఆసుపత్రులలో పేదలు పొందేలా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి నాంధి పలికిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ పేదలకు అవసరమైన అన్నిరకాల సేవలు ఒకేచోట లభ్యమయ్యేలా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ శిబిరం ద్వారా సుమారు రూ.30వేల విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని, ప్రతీ ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు, చిన్న పిల్లల వ్యాధుల చికిత్స్, గర్భిణీ మరియు స్త్రీల వ్యాధుల చికిత్స, క్షయవ్యాధి నిర్ధారణ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నిర్ధారణ, చికిత్స్, చర్మవ్యాధులు, కుష్టువ్యాధుల తనిఖీ చికిత్స, కేన్సర్, బి.పి, ఘగర్ మొదలగు వ్యాధుల చికిత్స, ఎముకుల వ్యాధుల చికిత్స, కంటి మరియు ఇఎన్.టి వ్యాధుల చికిత్స. సాదారణ వ్యాధుల చికిత్స, రక్త పరీక్షలు మరియు దంత వైద్య చికిత్స వంటి పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఉన్నారని, వారంతా మీకు సేవలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.ఆర్.వి.ఎస్.కుమార్, పి.ఓ, డి.టి.టి డా. జంపా కృష్ణమోహన్, మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు.