గుంటూరు జిల్లాలో గ్రామ, మండల స్థాయిలోని కార్యాలయాల పనితీరు, ప్రభుత్వ
పధకాల అమలును ప్రతి వారంలో కనీసం మూడు రోజులు క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులు పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ప్రత్తిపాడు లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో మధ్యాహ్న భోజన పధకం, రీజనల్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను, గ్రామ సచివాలయం, కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తనిఖీ చేసారు. జిల్లా పరిషత్ స్కూల్ లో విద్యార్డులకు వడ్డించడానికి సిద్దం చేసిన భోజనాన్ని పరిశీలించి విద్యార్డులతో కలసి భోజనం చేసారు. పదవ తరగతి చదువుతున్న గాయత్రి, జ్యోతి రెడ్డి తో జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజూ మెనూ ప్రకారం అందిస్తున్న భోజనం,
పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని, తరగతి గదులు, మంచినీటి సౌకర్యం చక్కగా వున్నాయని, టాయిలెట్స్ బాలికలకు, బాలురలకు పరిశుభ్రంగా వుంచుతున్నారని విద్యార్దులు సంతృప్తి వ్యక్తం చేసారు. పాఠశాలలో తరగతి గదులను, టాయిలెట్స్ , ల్యాబ్ లను జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన తరగతి గదులు, అందులోని ఫర్నిచర్ వాటి నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో పదవ తరగతి చదువున్న విద్యార్దులపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని
చదివించాలని, స్టడీ అవర్స్ క్రమం తప్పకుండా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి కి సూచించారు. పిల్లల సమర్ద్యాన్ని బట్టి యావరేజ్, బిలో యావరేజ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. పాఠశాలలో ఖాళీగా వున్న బోధన సిబ్బంది వివరాలు, గతంలో నిర్మించిన తరగతి గదులలో అవసరమైన ఫ్యాన్లు, విద్యార్డులకు అవసరమైన ఇతర వసతులపై ప్రతి పాదనలు అందించాలని తెలిపారు. అనంతరం యంపీడీఓ కార్యాలయ ఆవరణలో వున్న రీజనల్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్, గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తనిఖీ చేసారు. టెస్టింగ్ ల్యాబ్ లో విత్తనాలు, పురుగు
మందులు పరీక్షలు చేసే పరికరాలు, జంతువుల రోగ నిర్ధారణకు సంబంధించి పరీక్షలు నిర్వహించే పరికరాలను పరిశీలించి సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, పురుగు మందుల పరీక్షలలో నాణ్యత తక్కువని గుర్తిస్తే వాటిపై చర్య తీసుకునేందుకు సంబంధిత అధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జంతువుల రోగ నిర్ధారణకు సంబంధించి క్రొత్తగా వచ్చే రోగాలను కనుగొంటే వాటి నివారణకు అవసరమైన మందులు తయారీకి ఉన్నతాధికారులకు నివేదికలు
అందించాలన్నారు. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, ఏ ఎన్ యం, వి ఆర్ ఓ ల జాబ్ చార్ట్ గురించి జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పోస్టర్లు, నోటిస్ బోర్డు, సిటిజెన్ చార్ట్, సామాజిక సర్వే జాబితాల ప్రదర్శన క్రమపద్దతిలో వుండాలన్నారు. ప్రతిరోజూ సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలన్నారు. రెవెన్యూ సర్వీసులకు సంబంధించి నోటిసులను తప్పనిసరిగా సచివాలయం నోటిస్
బోర్డులలో ప్రదర్శించాలన్నారు. యండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సక్రమంగా పంపిణీ జరిపించే బాధ్యత విలేజ్ రెవెన్యూ అధికారులదే అన్నారు. వైయస్.ఆర్. సంపూర్ణ పోషణ క్రింద పంపిణీ చేసే కిట్ల లో నాణ్యత లేని ఆహార పదార్ధాలను గుర్తించి, వెంటనే కాంట్రాక్టర్ కు త్రిప్పి పంపించి నాణ్యతగలవి తెప్పించాలన్నారు. సచివాలయాల పనితీరు పూర్తిస్థాయిలో ,మెరుగుపరచేందుకు ఏప్రిల్ 30 వ తేది వరకు సమయం ఇవ్వడం జరుగుతుందని, మే 1 వ తేది నుండి సచివాలయ తనిఖీలలో నిర్ధేశించిన ప్రకారం క్రమపద్దతిలో పోస్టర్లు, జాబితాలు, ఉద్యోగుల జాబ్ చార్ట్ అమలు జరుగకపోతే మండల
స్థాయి పర్యవేక్షణ అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. అనంతరం ప్రత్తిపాడు కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తనిఖీ
చేసారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, ల్యాబ్ లు, కంటి పరీక్షలు, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. వైద్యులు, ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు, హాజరుపట్టిని పరిశీలించి సెలవులో వున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటి హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలు వైద్య సేవలపై సంతృప్తి చెందేలా కమ్యూనిటి హెల్త్ సెంటర్ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వైద్యులకు సూచించారు. నైట్ డ్యూటి డాక్టర్ ఖచ్చితంగా ఆసుపత్రిలోనే అందుబాటులో వుండాలని, వైద్య సహాయం కోసం వచ్చిన ప్రతి
ఒక్కరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత, ఇతర సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిసిహెచ్ఎస్ ను జిల్లా కలెక్టర్ ఫోన్ లో ఆదేశించారు. సిహెచ్ఎస్ పరిధిలోని ఆసుపత్రులను తనిఖీ చేసి క్రమపద్దతిలో వైద్యులు ప్రజలకు సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానికంగా వున్న చిన్న చెఱువు వర్షాకాలంలో నిండిపోయి సమీపంలోని కాలనీ లను నీరు
ముంచేత్తుతున్నదని స్థానికులు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి కి వినతి పత్రం అందించగా, జిల్లా కలెక్టర్ చిన్న చెఱువు ప్రాంతాన్ని, అక్కడ వున్న కల్వర్ట్ ను పరిశీలించారు. వర్షాకాలంలో చెఱువు ముంపుకు గురైన సందర్భంగా నీరు ఇళ్లలోకి రాకుండా డ్రైనేజీ కాలువల ద్వారా ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్థానికులకు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ తో పాటు, అన్ని శాఖల జిల్లా అధికారులు కనీసం వారంలో 3 రోజులు ప్రభుత్వ కార్యాలయాల పనితీరు పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. దీనిలో భాగంగా
మంగళవారం కొర్నెపాడు లో పేదలందరికి ఇళ్ల పధకం లే అవుట్ లో ఇళ్ల నిర్మాణాల పురోగతిని, ప్రత్తిపాడు లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో మధ్యాహ్న భోజనం నాణ్యతను, రీజనల్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లో రైతులకు అందిస్తున్న సేవలను, గ్రామ సచివాలయం, 30 పడకల కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు జిల్లా
అధికారులు, మండల స్థాయి అధికారులు క్షేత్ర కార్యాలయాలను ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. సోమవారం జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమం అనంతరం రెవెన్యూ డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పధకాల అమలు తీరు, పనితీరు పై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, నిర్దేశిత సమయంలో స్పందన అర్జీ లు గుణాత్మకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిష్కరించిన అర్జీ లను, జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలోను ర్యాండమ్ గా తనిఖీ చేయడం
జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డిఓ, సబ్ కలెక్టర్
కార్యాలయాలలోనూ, మండల స్థాయిలో తహశీల్దార్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ప్రభాకర రెడ్డి, ప్రత్తిపాడు తహశీల్దారు పూర్ణ చంద్ర రావు, యంపీడీఓ విజయ లక్ష్మీ, వ్యవసాయ శాఖ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ నున్నా వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ ఏ.డి శ్రీనివాస రెడ్డి, యంఈఓ రమాదేవి, సి హెచ్ వైద్యులు డా. శ్రీకాంత్, జెడ్పీటీసీ ఉప్పల కృష్ణ రెడ్డి, యంపీపీ అన్నమ్మ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.