పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మధురవాడలో నాడు-నేడులో భాగంగా 69 లక్షలతో అభివృద్ధి చేసిన ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవనాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈసంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మధురవాడ ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని.. ఇక్కడి స్థానికులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీహెచ్ సీ అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ పీహెచ్ సీని అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గా అప్ గ్రేడ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు మంత్రి సూచించారు. ఆసుపత్రిలో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఓపీ వార్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఆసుపత్రికి ఒక డాక్టర్, నైట్ సెక్యూరిటీ, ఇద్దరు వాచ్ మెన్లను నియమించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో సుందరీకరణ చేపట్టాలని, రోగుల బంధువులు వేచి ఉండేందుకు ఒక షెడ్డు నిర్మించాలని కూడా మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వసతులు, ప్రజలకు వైద్యం అందాలని మంత్రి అన్నారు. పీహెచ్ సీని రాబోయే రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. గతంలో ప్రభుత్వాసుపత్రులకు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే సామాన్యులు ఆలోచించేవారని.. ఇప్పుడు నాడు-నేడులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రులను, పాఠశాలలను అభివృద్ధి చేసి వారికి చేరువ చేసారని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి కోరారు. కరోనా టెస్టుల్లో, వ్యాక్సినేషన్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందని అన్నారు. మధురవాడకు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చేందుకు కృషి చెస్తానని మంత్రి అన్నారు.
జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాడు-నేడు ద్వారా ప్రభుత్వం ఆసుపత్రులను అభివృద్ధి చేస్తోందని అన్నారు. జిల్లాలో 77 ఆసుపత్రులు 53కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మరో 9 ఆసుపత్రులు నిర్మిస్తామని అన్నారు. ప్రస్తుతం పనుల దశల్లో ఉన్న ఆసుపత్రులను 15-20 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో సెక్యూరిటీ ఉంచాలని.. రాత్రిళ్ళు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. థర్డ్ వేవ్ వార్తల నేపథ్యంలో అందరూ వాక్సినేషన్ వేయించుకోవాలని అన్నారు.
మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ.. నాడు-నేడులో భాగంగా ఆసుపత్రులను అభివృద్ధి చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వాస్పత్రుల్లో మంచి వైద్యం లభించడం సంతోషించే విషయమని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాము, జీవీఎంసీ చీఫ్ విప్, ఆరో వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, నగరాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పిల్లా సుజాత, కార్పొరేటర్లు,, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.