1 ENS Live Breaking News

అరకు ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలి..

అరకు పర్యాటక ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడి రహదారులు,స్థానిక అభివృద్ధికే వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, అరకు పార్లమెంట్ డిస్టిక్ ఇన్చార్జి  పాచిపెంట శాంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శనివారం ఆమె ఘాట్ రోడ్డులో మీడియాతో మాట్లాడుతూ, అరకు వేలి మండలం సుంకర మెట్టు పంచాయతీ గిరిజన ప్రాంతాల్లోని మన్యం అందాలను  తిలకించడానికి  వచ్చిన పర్యాటకులు చాల ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే  అరచేతిలో ప్రాణం పెట్టుకొని వెళ్లాల్సివస్తోందన్నారు. రోడ్డు మార్గం ఎక్కడ పడితే అక్కడ పెద్దపెద్ద గోతులుతో, రోడ్డు వెడల్పు సరిగా  లేక పోవడం వల్ల రాకపోకలు నిలిచి ప్రయాణికులకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. రహదారులు సరిగా లేకపోవడంతో  వాహనాలు విపరీతంగా రావడం వల్ల చాలా ట్రాఫిక్ ఏర్పడుతోందన్నారు. ఎక్కువగా యాక్సిడెంట్లు కూడా జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని శాంతకుమారి ఆవేదన వ్యక్తం చేసారు. నిత్యం అనేకమంది ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ రహదారిపై  ప్రయాణిస్తున్న రహదారి బాగుకోసం  దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు. టురిజం వల్ల వచ్చే కోన్ని వేల కోట్లు  ఆదాయంతో  అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అందరికీ ఉపయోగ పడుతుందన్నారు.  టూరిజం నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఏమిచేస్తోందని ఘాటుగా ప్రశ్నించారు. అరకు మన్యంలోని ఏజెన్సీ గిరిజన 11 మండలాల ప్రాంతం  పల్లె గ్రామాల రోడ్డు మార్గాలు పరిస్థితులు కుడా అద్వాన్నంగా ఉన్నాయని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి  ఏజెన్సీ 11 మండలాల ఆదివాసిలకు,టురిస్టులకు,ప్రయాణికులకు రహదారుల నిర్మాణాలు చేపట్టి  రక్షణ కల్పించాలని శాంతకుమారి డిమాండ్ చేసారు.

Araku Valley

2020-12-19 19:21:44

అర్హులమైనా మాకు కాపు నేస్తం అమలు కాలేదు..

విశాఖపట్నం జిల్లా,  ఎస్.రాయవరం మండలం, సైతారుపేట కు చెందిన మహిళలు కాపు నేస్తం తమకు వర్తింపజేయాలని కోరుతూ ఎంపీడీఓకి స్పందనలో ఫిర్యాదు చేశారు. ఆ పథకానికి  అన్నివిధాలా తాము అర్హులమైనా ఈ పథకం తమకు మంజూరు కాలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, కాపునేస్తం పథకానికి మోటూరు గోవిందమ్మ, నాగమణి, గొన్నాబత్తుల పద్మ, వరలక్ష్మి, కామేశ్వరి,మంగతల్లి సమ్మంగి పద్మ, రావి నాగమణిలు దరఖాస్తు చేసినా ఆ పథకం తమకు వర్తించేయలేదున్నారు.  గ్రామంలో 7 ఎకరాలు భూమి ఉన్న మహిళకు మంజూరు చేసిన అధికారులు తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించారు. 29.07.2020 ఈ విషయం పై ఎం.పి.డి.ఓ కు పిర్యాదు చేసినా ఇప్పటి వరకూ తమకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో అందరికీ పథకం వర్తింపజేశారని తమను మాత్రం వదిలేశారని చెప్పారు. అంతేకాకుండా గ్రామ సచివాలయ కార్యదర్శిని ఎన్నిసార్లు అడిగినా మీకూ పథకం వస్తుందని చెబుతున్నారని కానీ అందరికీ వచ్చిన పథకం తమకు మాత్రం రాలేదని మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు అధికారులు, సచివాలయ సిబ్బంది చేసిన అన్యాయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి అర్హులమైన తమకు కూడా పథకం వర్తింపచేయాలని బాధితులు కోరుతున్నారు. 

s.rayavaram

2020-12-18 21:28:53

"విక్టరీ వెంకటేష్ " పుట్టినరోజు నేడు

దగ్గుబాటి రామానాయుడు, శ్రీమతి రాజేశ్వరి దంపతులకు రెండో సంతానంగా దగ్గుబాటి వెంకటేష్ తే 13-12-1960 దీ నాడు కారంచేడు లో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తండ్రి రామానాయుడు తో, అన్న సురేష్ బాబుతో సినిమాలలో నటించే అభిరుచి ఉన్నట్టు తన మనసులో మాట తెలియజేశారు వెంకటేష్ . ఆమోద ముద్రవేసి అంగీకారం వెంటనే తెలియజేశారు వీరిద్దరు. వీరి సొంత బేనర్ అయినటువంటి సురేష్ మూవీస్ బ్యానర్పై" కలియుగ పాండవులు " చిత్రాన్ని నిర్మించారు . ఈ చిత్రానికి తండ్రి రామానాయుడు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేష్ హీరోగా నటించిన మొదటి చిత్రమే విజయవంతం కావటం విశేషం. " బొబ్బిలిరాజా " "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" " సూర్యవంశం" "ప్రేమించుకుందాం రా" "కలిసుందాం రా !" " రాజా" "జయం మనదేరా " "లక్ష్మి" "సంక్రాంతి " "సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు" " F2 "వంటి చిత్రాలెన్నో విజయం సాధించాయి. ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి కుటుంబ కధా చిత్రాల కధానాయకుడిగా తెలుగు ప్రేక్షకులతో అభినందించ బడుతున్న హీరో వెంకటేష్. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి "విక్టరీ"ని ఇంటి పేరుగా చేసుకున్న "విక్టరీ వెంకటేష్" పుట్టినరోజు నేడు. అంతేకాకుండా పెళ్లి రోజు కూడా ఈ రోజే కావడం గమనించ దగ్గ విషయం . ఇటువంటి పుట్టినరోజులు, పెళ్లిరోజులు విక్టరీ వెంకటేష్ గారు ఎన్నో ...ఎన్నెన్నో... ఆనందకరంగా,జరుపుకోవాలని ENS సినిమా పేజీ టీమ్ కోరుకుంటుంది .

2020-12-13 02:41:15

అక్కడ ఏవైనా సగం సగం పనులే..

ప్రభుత్వం గ్రామసచివాలయాల ద్వారానే అన్ని సేవలూ ప్రజలకు చేరాలని ప్రభుత్వం నెత్తీ నోరూ కొట్టుకుంటే..దానికి భిన్నంగా ఎస్.రాయవరం సచివాలయ అధికారులు వ్యవహరింస్తున్నారు. కాలువ కోసం తవ్విన మట్టిని వదిలేయకుండా తొలగించాలని అర్జీచేస్తే సగం సగం తవ్వేసి వదిలిపెట్టేశారు. మండల కేంద్రం ఎస్.రాయవరం నుంచి సర్వసిద్ది గ్రామం వెళ్లే తారురోడ్డును అనుకొని ఉన్న సర్వసిద్ది పంటకాలువ పూడిక  తీయగా వచ్చిన మట్టిని గ్రామ పంచాయతీ సిబ్బంది తారురోడ్డుపై వేసి వదిలేశారు. దీంతో ఈవిషయమై మండలానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త విషయాన్ని పంచాయతీ సిబ్బందికి ద్రుష్టికి తీసుకెళ్లడంతో అక్కడ పోసిన మట్టిని పూర్తిగా తొలగించకుండా సగం సగం తీసి వదిలేశారు. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. పంచాయతీ సిబ్బంది ఏంచేసినా ఇలా సగం సగం పనులే చేస్తూ ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని సోమిరెడ్డిరాజు మీడియాకి వివరించారు. సగం సగం తీసిన మట్టి కూడా రోడ్డుపైకి రావడంతో చినుకులు పడిన సమయంలో బురదమయంగా మారుతోంది. మళ్లీ ఈవిషయాన్ని గ్రామసభ ద్రుష్టికి కూడా తీసుకెళ్లినట్టు రాజు చెప్పారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని కాలువ దగ్గర మట్టిని పూర్తిస్థాయిలో తొలగించాలని రాజు పంచాయతీ అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వం అన్నిశాఖలకు సిబ్బందిని నియమించినా ఎస్.రాయవరంలో మాత్రం సచివాలయ సేవలు ప్రజలు పూర్తిస్థాయిలో అందడటం లేదని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువమట్టిని తొలగించకపోతే ఈసారి ఆ ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కి అందజేస్తానని రాజు చెప్పారు.  పూర్తిస్థాయిలో మట్టిని పూర్తిగా తొలగించాలని, అంతే తప్ప తూతూ మంత్రంగా పనులు చేయవద్దని మరొకసారి పంచాయతీ అధికారులను రాజు కోరారు.

s.rayavaram

2020-12-12 22:10:05

మరుగుదొడ్ల అవినీతిపై అధికారిక విచారణ..

విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలంలో మరుగుదొడ్లలో జరిగిన అవినీతిపై ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. మండలంలో 28 గ్రామ పంచాయతీలకు మంజూరు అయిన 6539 వ్యక్తిగత మరుగుదొడ్ల పధకం కు మంజూరైన రూ 9.22 కోట్లు రూపాయలు ప్రోత్సాహకం చెల్లింపుల్లోను, నిర్మాణాల్లోను జరిగిన భారీ అవకతవకలపై సమాచార హక్కు కార్యకర్త సోమిరెడ్డి రాజు రాష్ట్ర జస్టిస్ లోకాయుక్త కు చేసిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రూరల్ వాటర్ సప్లై  యస్.ఇ, వి. రవికుమార్ వారం రోజుల క్రితం పేటసూదిపురం గ్రామం లో విచారణ చేపట్టారు. ఇందులో ఎంతమంది లబ్దిదారులున్నారు, ఏ స్థాయిలో అవినీతి జరిగింది, ఎంతమందికి ప్రోత్సాహకాలు అందాయి తదితర అంశాలను స్వయంగా లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విచారణ కార్యక్రమంలో ఎ.ఇ యస్.కె.సాహెబ్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఎం.ఆర్.సీ లు, తమ సిబ్బందితో స్వయంగా పరిశీలించి లబ్దిదారులను విచారిస్తున్నారు. ఈ రెండు రోజులలో వమ్మవరం, పెనుగొల్లు, గెడ్డపాలెం, పి.దర్మ వరం గ్రామాల్లో విచారణ చేశామని తెలిపారు.

ఎస్.రాయవరం

2020-12-08 20:00:32

శ్రీశ్రీశ్రీ పడమటమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు..

అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట మండలం బయ్యవరం గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీశ్రీశ్రీ పడమటమ్మ తల్లికి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎప్పటినుంచో రావాలనుకుంటున్న అమ్మవారికి ఆలయానికి వచ్చి పూజలు చేయడం ఆనందంగా వుందన్నారు కరోనా పూర్తిగా తగ్గి ప్రజలు సాధారణ జీవితం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలూ సందర్శించాలనే లక్ష్యంతో తన పర్యటన కొనసాగుతోందన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, మండల పార్టీ అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీనివాసరావు, దంతులూరి శ్రీధర్ రాజు, గొర్లి సూరిబాబు, మలసాల కిషోర్, శ్రీకాంత్ రాజు, కరక శేషు, గొల్లవిల్లి బాబురావు, సత్యనారాయణ, నానాజీ, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Kasimkota

2020-12-08 12:04:41

అన్నవరంలో వైభవంగా కార్తీక దీపోత్సవం..

అన్నవరంలోని శ్రీనూకాలమ్మ అమ్మవారి ప్రాంగణలంలో వెలసిన శ్రీ పరమశివుడి విగ్రహం వద్ద కార్తీక దీపోత్సవం ఎంతో వైభవంగా సాగింది. శివలింగ నమూనాతో చేసిన ఆకారంలో రెండువేల దీపాలతో శివయ్యకు దీపాలతో భక్తులు పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త గంగరాజు నేత్రుత్వంలోని ఆలయ కమిటీ కార్తీకమాసం చివరి వారం కావడంతో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాయంత్రం ఆరు గంటల నుంచే భక్తులు విశేషంగా తరలి వచ్చి దీపాలు వెలిగించి శివుడికి పూజలు చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగానికి పాలాభిషేకం చేసుకునే సౌలభ్యం కూడా కల్పించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోనే ఉచిరిచెట్టు, బిల్వ దలాల చెట్లు ఉండటంతో నాలుగు వారాలుగా భక్తులు విశేషంగా తరలి వచ్చి కార్తీక పూజలు జరుపుకున్నారు. ఆఖరిరోజు వైభవంగా జరిగిన కార్తీక దీపోత్సవ వెలుగులో శివయ్య దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులు దర్శనమిచ్చారు.

Annavaram

2020-12-07 20:58:42

"ఇల్లు-ఇల్లాలు "చిత్రానికి 48 వసంతాలు

సూపర్ స్టార్ "కృష్ణ" , కళాభినేత్రి వాణిశ్రీ అద్భుతంగా నటించిన చిత్రం "ఇల్లు-ఇల్లాలు". సుబ్బిరెడ్డి సమర్పించిన ఈ చిత్రాన్ని నందిత ఫిల్మ్స్ వారు నిర్మించారు. స్క్రీన్‌ప్లే , దర్శకత్వం పిచంద్రశేఖర్రెడ్డి వహించారు . N.సుబ్బారాయుడు , G.A. రామసుబ్బయ్య నిర్మాతలుగా వ్యవహరించారు . ఇంటి యొక్క విలువను , ఇల్లాలు యొక్క ప్రాధాన్యతను ఈ చిత్రంలో ఎంతో చక్కగా చూపించారు దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి . సంగీత పరంగా ఎంతో ఘన విజయం సాధించింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. మాస్ హీరోగా ప్రసిద్ధిగాంచిన సూపర్ స్టార్ "కృష్ణ " ఈ చిత్రంలో ఎంతో క్లాస్ గా నటించడం విశేషం. ఈ చిత్రానికి మృదుమధురమైన సంగీతం కె.వి.మహదేవన్ అందించారు . ఈ చిత్రం విడుదల తేదీ 07-12-1972. నేటితో నలభై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం యూనిట్ కు ENS సినిమా అభినందనలు తెలియ చేస్తుంది .

2020-12-07 14:06:25

"ఆదర్శవంతుడు"కి @ 31 వసంతాలు

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ,రాధ కాంబినేషన్లో విడుదలైన చిత్రం ఆదర్శవంతుడు . ఈ చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు గారి వీరాభిమాని దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు . సీహెచ్ ప్రకాశరావు నిర్మాణ సారధ్యం వహించారు. డిసెంబర్ ఏడు 1989 వ సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైంది. సంగీతపరంగా పాటలు ఎంతో బావుంటాయి . మ్యూజికల్ హిట్ సాధించింది .ఈ చిత్రం అపజయం పొందింది . నేటితో ఆదర్శవంతుడు చిత్రం విడుదల అయ్యి ముప్పై ఒక సంవత్సరాలు పూర్తి చేసుకుంది .

2020-12-07 13:35:24

జనగనన్న చేయూతకి ఊర్లో ఉన్నోడు అనర్హుడు..

అధికారులు తలచుకుంటే గ్రామంలో లేని వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తారు..ఏంటి లేని వ్యక్తి ఎలా అందిస్తున్నారని డౌట్ పడుతున్నారా అలా అయితే మీరు ఒక్క విశాఖజిల్లా, ఎస్.రాయవరం మండల కేంద్రానికి వస్తే..ఇక్కడి సచివాలయ సిబ్బంది చేసే చేతి వాటం ఎలావుంటో మీకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించాలని నెత్తీనోరూ కొట్టుకుంటే ఇక్కడి గ్రామసచివాలయ సిబ్బంది మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ గ్రామంలో లేని వారికి కూడా పథకాలు కట్టబెట్టి వారి పనితనాన్ని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. ఎస్.రాయవరం గ్రామంలో 'జగనన్న చేయూత పథకం' అభాసు పాలవుతున్నదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఒక వర్గం వారికి చేయూత పథకంలో 'చేయి'చ్చి మిగిలిన వారికి రిక్త హస్తం చూపించడం చూస్తే అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  గ్రామంలో 24 మంది రజక వృత్తి ఉండగా, ఈ పథకం కోసం 20 దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన 17 మందికి  పథకాన్ని మంజూరు చేశారు. అయితే వీరిలో చీపురుపల్లి చక్రరావు, బొంబూరి నారాయణరావు, బొంబూరి రాము ముగ్గురికి ఇస్త్రీ బడ్డీలు లేవంటూ దరఖాస్తులను తిరస్కరించారు. వాస్తవం గా చేయూత పథకం మంజూరైన 17 మందిలో 6 గురికి మాత్రమే ఇస్త్రీ బడ్డీలు ఉన్నాయి. మిగిలిన 11 మందికి ఎటువంటి బడ్డీలు లేకపోగా, ఈ 11 మందిలో 4 గురికి పెంన్షన్లు కూడా అందుతున్నాయి. 'వడ్డించేవాడు మనవాడైతే బంతి చివరన కూర్చున్నా విస్తరి నిండుతుందన్నట్టు'గా బొంబూరి శంకర్ అనే వ్వక్తి హైదరాబాద్ లోనూ, చీపురుపల్లి నాగు విజయవాడలో ఉన్నప్పటికీ వారికి పథకాలు మంజూరు చేశారు. దీనిని బట్టి చూస్తే జిల్లా అధికారుల అదేశాలు ఎస్.రాయవరం మండల కేంద్రంలో ఏ స్థాయిలో అమలు జరుగుతున్నాయో అర్ధమవుతుంది. టీషాపు నడుపుకుంటున్న బొంబూరి సత్యనారాయణ, మాంసం దుకా ణం నిర్వహిస్తున్న అడ్డురి పెంటయ్య వీరిరువురకు మంజూరు చేశారు. ఇదే గ్రామంలో ఉంటూ కుల వృతి చేసుకుంటున్న ముగ్గురికి పథకానికి అనర్హులుగా తిరస్కరించడం చర్చనీయాంశం అవుతుంది. ఇదే విషయమై గ్రామ సచివాలయ కార్యదర్శికి గత నెల 24 వ తేదీన చీపురుపల్లి చక్రరావు పిర్యాదు కూడా చేశారు. ఒక వర్గానికి చెందిన వక్తులుగా భావించి తమకు అన్యాయం చేశారని, ఇందుకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే బి.సి.కార్పొరేషన్ అధికారితోపాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు బాధితులు మీడియాకి వివరించారు. 

s.rayavaram

2020-12-06 19:15:01

కాలువ తవ్వి ఆ మట్టిని రోడ్డుమీదే వదిలేశారు..

అధికారులు చేసే ఒక్కోపని ప్రజలకు వాహనదారులకు తీవ్రమైన పరీక్షలు పెడుతోంది. ఏదో మొక్కుబడిగా చేసిన పనికి ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎస్.రాయవరం నుంచి సర్వసిద్ది పోవు తారురోడ్డు ను అనుకొని ఉన్న సర్వసిద్ది పంటకాలువ పూడికలను ఇటీవలే తొలగించారు. అలా  తీయగా వచ్చిన మట్టిని తారురోడ్డు పై వేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఆ మట్టికాస్త రోడ్డుకి ఇరువైపులా దిబ్బలుగా మారిపోయింది. వర్షం వచ్చిన ప్రతీసారి రోడ్డు మొత్తం బురదమయంగా మారిపోతుంది. ఈ విషయమై అధికారులకు గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు వాపోతున్నారు. కాలువు పూడికలు తీసి వదిలేశారని, అదే మట్టి మళ్లీ కాలువల్లోకి జారడంతో పాటు ఇటు రోడ్డుపై ప్రయాణాలు చేసేవారికి కూడా ఇబ్బందిగా మారుతోందన్నారు. ఇప్పటికైనా అధికారులు వాహన చోదకుల కష్టాలను ద్రుష్టిలో ఉంచుకొని రోడ్డుపై వేసిన మట్టిని తొలగించాలని రాజు అధికారులను కోరుతున్నారు.

s.rayavaram

2020-12-06 09:51:51

హమ్మయ్య పందులను పట్టుకున్నారు..

విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరంలో గ్రామసచివాలయ సిబ్బంది గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నపందులను పట్టుకున్నారు. మొత్తం 15 పందులను పట్టుకొని సచివాలయంలో బందించారు. అప్పటి వరకూ పందులను గ్రామానికి దూరంగా పెట్టాలని చెప్పినా వినని పందుల పెంపకం దారులు పందులను పట్టుకోగానే సచివాలయానికి తరలి వచ్చారు. గ్రామానికి దూరంగా పందులను పెంచితే తప్పా వాటిని వదిలిపెట్టేది లేదని గ్రాసచివాలయ సిబ్బంది తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పందులను పట్టుకొని సచివాలయంలో పెట్టామన్నారు. సచివాలయ పరంగా శానిటేషన్ సిబ్బంది ఎంత శుభ్రం చేసినా పందుల వలన మొత్తం అంతా చెత్తగా మారుతోందని అన్నారు. అధికారుల సూచనల మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకొని, వాటిని విడిచిపెట్టాలా, లేదంటే గ్రామశివారు పెంచుకుంటానంటే వదిలిపెట్టాలనే విషయమై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

s.rayavaram

2020-12-05 11:41:58

ఉద్దానం ప్రాజెక్ట్ వేగంగా పూర్తిచేయాలి..

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం త్రాగునీరు ప్రాజెక్ట్ వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. ఉద్దానం తాగు నీటి ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం సమావేశం జరిగింది. ప్రాజెక్టు త్వరిగతగతిన పూర్తి కావాడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో అత్యద్భుత ప్రాజెక్ట్ గా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేసారు. వంశధార నీటిని తాగు నీటిగా కల్పించడం వలన ఉద్దానం ప్రాంత ప్రజలు ఎన్నాల్లగానో వేచి చూస్తున్న శుద్ధ జలాలు అందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరగా పూర్తి చేసి ఉద్దానం ప్రజల కోరిక నెరవేర్చడమే కాకుండా వారి హృదయాల్లో నిలిచిపోవాలని అన్నారు. రహదారులు, భవనాల శాఖ, జాతీయ రహదారుల సంస్ధ ప్రాజెక్టు పైపు లైన్లు వేయునపుడు అవసరమగు అన్ని చర్యలు సకాలంలో పూర్తి చేసి పనులు వేగవంత కావడానిక చేయూతను అందించాలన్నారు. పైపులైను రూటులో ఉన్న జలవనరులు, వివిధ నిర్మాణాలు, చెరువులు, కాలువలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.       ఉద్దానం ఏడు మండలాల్లో  కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో శుద్ధ జలాలను రూ.7 వందల కోట్లతో తాగు నీటి ప్రాజెక్టును చేపట్టుటకు పరిపాలనాపరమైన ఆమోదాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. హిరమండలం వంశధార రిజర్వాయర్ వద్ద ఇంటేక్ వెల్ నిర్మించి అచ్చట నుండి పైపు లైను ద్వారా వజ్రపు కొత్తూరు మండలంలో 121 గ్రామాలు, పలాసలో 86 గ్రామాలు, మందసలో 225 గ్రామాలు, సోంపేటలో 74 గ్రామాలు, కవిటిలో 118 గ్రామాలు, కంచిలిలో 138 గ్రామాలు, ఇచ్ఛాపురంలో 45 గ్రామాలు వెరశి ఏడు మండలాల్లో 807 గ్రామాలకు తాగు నీటిని అందించుటకు ప్రతిపాదించడం జరిగింది. ఈ 807 ఆవాసాలలో 4.69 లక్షల మంది జనాభా నివశిస్తున్నారు. ప్రాజెక్టును 2051 సంవత్సరం వరకు అవసరాలకు తగిన విధంగా రూపకల్పన చేస్తున్నారు. ఏడాదికి 1.12 టిఎంసి నీరు అవసరమని గుర్తించడం జరిగింది. ఇందుకు 16 ప్రదేశాలలో ఓవర్ హెడ్ బేలన్సింగు రిజర్వాయర్లు, 23 ప్రదేశాల్లో గ్రౌండు లెవెల్ బేలన్సింగు రిజర్వాయర్లు నిర్మించుటకు, మెళియాపుట్టి మండలం మకనపల్లి, పలాస మండలం టెక్కలిపట్నం వద్ద హెడ్ వర్కులను ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 1062 కిలోమీటర్ల మేర పైపు లైన్లు వేయుటకు, 51 సంపులు నిర్మించుటకు ప్రతిపాదించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, డివిజనల్ అటవీ అధికారి సందీప్ కృపాకర్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాసరావు, రహదారులు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు కె.కాంతిమతి, వంశధార పర్యవేక్షక ఇంజనీరు డోల తిరుమల రావు, ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీరు ఎన్.రమేష్, జాతీయ రహదారుల సంస్ధ ఇంజనీరు ఎస్.బసవ రాజు, సంబంధిత మండలాల తహశీల్దార్లు  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-01 17:34:49

దుబ్బు నిలబెట్టి కడితే పంట పాడవదు..

తుపాను కారణంగా పాక్షికంగా పడిపోయిన  వరి పొలం దుబ్బులను నిలబెట్టి కట్టు కోవడం ద్వారా పంట నాశనాన్ని నియంత్రించవ్చునని అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. సోమవారం కోటవురట్ల మండలంలోని కోటవురట్ల, కైలాపట్నం. రాజుపేట గ్రామాల్లో పంటపొలాలను పరీశిలించారు. ఈ సందర్భంగా చీఫ్ సైంటిస్ట్ పి.సాంభశివరావు మాట్లాడుతూ, పడిపోయిన వరిదుబ్బులను నిలబెట్టుకోవడం ద్వారా పంట యదావిధిగా పండుతుందని, అయితే కిందరాలిన గింజ మొలకెత్తకుండా ఉండాలంటే 20కేజిల ఉప్పునీటిని ఎకరాపొలానికి పిచికారీ చేయడం వలన గింజ మొలకెత్తకుండా ఉండిపోతుందన్నారు. అదే సమయంలో పడిపోయిన గింజ భూమిలో కిలిసిపోతుందని వివరించారు. అదేవిధంగా రైతులకు ఉపయోగపడే కొన్ని సస్యరక్షణ చర్యలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో సైంటిస్టులు బి.భవానీ, కె.సైలజ, ఏఈఓ కె.సత్యన్నారాయణ, ఎంపీఈఓలు, విలేజి హార్టికల్చర్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Kotavuratla

2020-11-30 17:37:28

కార్పోరేటర్ గా షకలక శంకర్

స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం 'కార్పొరేటర్'. 'సంజయ్ పూనూరి'ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతగా, డాక్టర్ ఎస్.వి.మాధురి సహ నిర్మాతగా.. రూపొందుతున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో.. 5 పాటలు - 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంకర్ పెర్ఫార్మెన్స్ 'కార్పొరేటర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెబుతున్నారు. శంకర్ సరసన సునీత పాండే-లావణ్య శర్మ- కస్తూరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, యాక్షన్: వింగ్ చున్ అంజి, డాన్స్: సూర్యకిరణ్- వెంకట్ దీప్, ఎడిటింగ్: శివ శర్వాణి, కెమెరా: జగదీష్ కొమరి, సంగీతం: ఎం.ఎల్.పి.రాజా, సహ నిర్మాత: డాక్టర్ ఎస్.వి.మాధురి, నిర్మాత: ఎ.పద్మనాభరెడ్డి కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంజయ్ పూనూరి!!!

2020-11-30 13:32:36